Monday, March 26, 2007

సుందర కాండ 12వ సర్గ

అంత హనుమ ముందుకురికెను
సీత కొరకై తిరిగి వెదకెను
లతలు చేరిన సస్య గృహములు
కళా గృహమును, నిషా గృహమును 1

ఇంత వెదికినా సీత దొరకక
హనుమ ఈ విధి చింత నుండెను
"ఇంత వెదికినా దొరక దాయెను
మాత ప్రాణము వదిలి వుండునా? 2

మాన ధనమును మలినమవ్వక
అసుర గణముల చేత చిక్కక
వారి క్రోధపు అగ్ని సిఖలకు
మరణ పధమున వెళ్ళి వుండును 3

వికృత ఆకృత రాక్షస పత్నుల
భీకర ఘోషల భయపడి పొయి
సుకుమారి యగు జనక సుత
భీతితో అసువులు బాసి వుండును 4

సీతను చూడక, కార్యము చేయక
గడువు దాటినా తిరిగి వెళ్ళక
నేనేట్లు సుగ్రీవుని చేర గలను?
తప్పక శిక్షకు పాత్రుడునగుదును 5


పట్టణమంతయు తిరిగి వుంటిని
రావణ స్త్రీలను చూసి వుంటిని
సీతను మాత్రము కాన కుంటిని
శ్రమకు తగిన ఫలితము దక్కకున్నది 6

జలధిని దాటి, లంకకు చేరి,
సీతను చూసి, ఏమిచేసితివి ?,
అని అడిగెడి తోటి మూకలకు
చెప్పెడి వచనము నాకడ లేదు 7

సీతను చూడక, ఇచ్చిన గడువును
దాటుట తక్క ఏమి చేసితి ?
వట్టి చేతులతొ వెళ్ళజాలము
తెలిసిన కోతులు అగ్నిని చేరుదురు 8

జలధిని దాటి ఆవల చేరి
అంగద జాంబవంతాది వీరుల కూడి
సీతను చూడని నా ముఖమును
ఏవిధి చూపను? ఏమని చెప్పను? 9


మనసు నింతయు కృంగ నీయక
బుద్ధి బలమును తోడు చేసి
స్వయం శక్తితో పాటుపడిన
అసాధ్య మన్నది లేదు జగతిన 10

మనహ్‌స్థైర్యము గుండె నిబ్బరము
బుద్ధి కుశలత కార్య దీక్ష
కలిపి ముందుకు నేను వెళ్ళెద
సీత కొరకై వెదకి చూసెద 11

పాన శాలలు, పుష్ప వనములు
సభా భవనము మధ్య మార్గములు
ఇండ్ల గదులను చిత్ర శాలలు
ఒక్కటి వదల అంతా వెదకితిని " 1213

అనుచు మనమున హనుమ తలచుచు
భూగృహములు, భోషాణములు
చిన్న ఇండ్లను, మూల గదులను
వెదక సాగెను మాత కొరకై 14

గోడలెక్కుతు మిద్దేలెగురుతు
తలుపునెట్టుతు తొంగి చూచుచు
విసుగు అన్నది లేక హనుమ
అన్ని స్థలములు వెదక సాగెను 1516

రావణ నగరము అన్ని చెరుగుల
హనుమ వెదకని తావులు లేవు
నాలుగు అంగుళ స్థలమును కూడ
వదలక వెదికెను బుద్ధి కుశలుడు 17

కోట గోడల మధ్య దారులు
నాల్గు వీధుల కూడలి స్థలములు
తటాక పరిసరములు కూప కుహరములు
వదలక వెదికెను కార్య దక్షుడు 18

వివిధ ఆకృతుల రాక్షసి గణములు
భయంకరమగు వేషధారులు
అతి భయానకముగ దర్శనమిచ్చిరి
సీత మాత్రము దొరక దాయెను 19

సుందరతకే తలమానికమగు
అతి సుందరమగు విధ్యాధర కాంతలు
హనుమ అచ్చెరువతో చూసెను గానీ
సీతను మాత్రము చూడక వగచెను 20


గుండ్రని పిరుదుల నాగ కన్నియలు
చంద్రుని పోలిన సుందర మోములు
నిసిత దృస్టితో హనుమ చూసెను
సుందర మధ్యను కానక పోయెను 21

దొంగతనముగా తేబడిన నాగులు
బలవంతముగా వచ్చిన కన్యలు
రావణ బలముకు ఓడిన స్త్రీలు
హనుమ సీతను దక్క అందరిని గాంచెను 22

మహా బలుడు, బుద్ధి కుశలుడు
పవన సుతుడు, రామ భక్తుడు
ఇంత తిరిగినను సీతను గానక
వ్యాకులత చెందిన మనమును బొందెను 23

వంద యోజనములు దాటిన శ్రమయు
సీతను వెదకగ గడచిన కాలము
బూడిద పోసిన పన్నీరాయ నని
మరుతి మనసు క్షొభలో పడెను 24

బాధతొ నిండి బరువుగ మారిన
హృదయము శక్తితో కూడగట్టుకుని
పుష్పకము వదిలి బయటకు చేరి
నింగిని చూస్తూ ఆలోచించెను 25

No comments: